- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
- మంచిర్యాలలో వందేభారత్ హాల్టింగ్ ప్రారంభం
Vandhe Bharth: రాబోయే దశాబ్దంలో తెలంగాణ రైల్వే అభివృద్ధి కోసం కేంద్రం సుమారు ₹80 వేల కోట్లను వెచ్చించబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మోదీ పాలనలో రైల్వే రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, గత 10 ఏళ్లలో రాష్ట్ర రైల్వే ప్రాజెక్టుల కోసం ఇప్పటికే ₹42 వేల కోట్లకు పైగా కేటాయించామని ఆయన అన్నారు.
సోమవారం మంచిర్యాలలో వందే భారత్ రైలు హాల్టింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, ‘‘భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్ విప్లవాత్మక మార్పులు తెచ్చింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 150 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటి ద్వారా ఇప్పటివరకు 3 కోట్ల మంది ప్రయాణీకులు ప్రయోజనం పొందారు. ఒక్కో వందే భారత్ రైలు తయారీకి సుమారు ₹130 కోట్లు ఖర్చవుతోంది’’ అని వివరించారు.
ప్రస్తుతం తెలంగాణలో 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, త్వరలో మరో 2 రైళ్లు రాబోతున్నాయని తెలిపారు. ‘‘సికింద్రాబాద్–పూణె, హైదరాబాద్–నాందేడ్ రూట్లపై వందే భారత్ రైళ్లు నడపాలనే ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటుంది’’ అని వెల్లడించారు.
అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్లు మినీ ఎయిర్‌పోర్టుల్లా రూపుదిద్దుకుంటున్నాయని మంత్రి తెలిపారు. ‘‘మొన్న మధ్య చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను సందర్శించాను. ఆ స్టేషన్ ఎయిర్‌పోర్ట్‌లా కనిపిస్తోంది. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు ₹2,751 కోట్లు కేటాయించాం’’ అని చెప్పారు.
2014కు ముందు రైల్వేల పరిస్థితి దారుణంగా ఉండేదని ఆయన గుర్తుచేశారు. ‘‘అప్పట్లో రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాలు కూడా లేకపోయేవి. టాయిలెట్లు దుర్వాసనతో ఉండేవి. ట్రాక్‌లు చెత్తతో నిండిపోయేవి. కానీ మోదీ నేతృత్వంలో రైల్వేల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి’’ అని వ్యాఖ్యానించారు.
మంచిర్యాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. ‘‘మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కోసం ₹3.5 కోట్లు కేటాయించాం. త్వరలో పనులు ప్రారంభిస్తాం. అదనంగా స్టేషన్ అభివృద్ధికి అమృత్ భారత్ పథకం కింద ₹26 కోట్లు కేటాయించాం. మంచిర్యాలను మినీ ఎయిర్‌పోర్టులా తీర్చిదిద్దుతాం’’ అని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రానికి కేంద్రం విస్తృత స్థాయిలో సహకరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ‘‘2014లో యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు రైల్వే బడ్జెట్ కింద కేవలం ₹258 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ ఈ ఏడాదే మేము ₹5,336 కోట్లు కేటాయించాం. ఇది 20 రెట్లు ఎక్కువ’’ అని తెలిపారు.
రాజకీయ విభేదాలను పక్కనబెట్టి అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర నాయకులను ఆయన పిలుపునిచ్చారు. ‘‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై ఆరోపణలు చేస్తూ నిధులను కోల్పోయింది. ఇకపై రాష్ట్రం–కేంద్రం కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీ, బీజేపీ ఎమ్మెల్సీ అంజి రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
–శెనార్తి మీడియా, మంచిర్యాల
