- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
Bandi Sanjay: ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ(BJP) ఎల్లప్పుడూ పోరాడుతుందని, వారికి అండగా నిలుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆదివారం రాత్రి క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన జిల్లా సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ప్రజా సమస్యలపై పోరాడే క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసులు పెట్టినా భయపడేదేమీ లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కార్యకర్తలు, నాయకులు పోరాటాలు కొనసాగిస్తారని తెలిపారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు, పట్టభద్రులు, రైతులు, మహిళల సమస్యల పరిష్కారానికి బీజేపీనే కృషి చేస్తున్నదని స్పష్టం చేశారు.
ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. పీఆర్సీ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని, పెన్షన్ పెంపు, కల్యాణలక్ష్మీ, నిరుద్యోగ భృతి తదితర విషయాల్లో ఏ మార్పు లేదని ఆరోపించారు. రైతులకు రుణ మాఫీ, భరోసా వంటి హామీలను అమలు చేయలేదన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS) రెండు ఒకటేనని ఆరోపించిన ఆయన, డ్రగ్స్ కేసు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కార్ రేస్ వంటి వ్యవహారాల్లో కాంగ్రెస్ పాత్ర ఉందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలపడంలో కాంగ్రెస్ తన అసమర్థతను చాటుకుందని విమర్శించారు.
ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడింది తపస్ మాత్రమేనని, నిరుద్యోగులకు అండగా నిలిచింది బీజేపీనేనని మరోసారి స్పష్టం చేశారు. గ్రూప్-1 అభ్యర్థుల పక్షాన పోరాటం చేస్తే బీజేపీ నాయకులు, కార్యకర్తలను దొంగ కేసుల్లో జైలుకు పంపారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఉద్యోగులు, టీచర్లు, నిరుద్యోగులకు ఏ సమస్య వచ్చినా బీజేపీ అండగా ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విన్నవించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొంది. ఈ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెరబెల్లి, ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల