NCF
NCF: బ్రోచర్ విడుదల చేస్తున్న అధికారులు

Nature Conservation Foundation: పక్షుల సంరక్షణపై అవగాహన పెంచాలి

  •  పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ 

Nature Conservation Foundation: పర్యావరణంలో పక్షుల ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (PCCF) డాక్టర్ సువర్ణ అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో  కలిసి మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో జరిగిన బర్డ్స్ ఫెస్టివల్ అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు . అటవీ శాఖ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF), నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (NCF) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

పక్షుల పరిరక్షణకు సమిష్టి కృషి అవసరం

పక్షులు పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక భూమిక పోషిస్తున్నాయని డాక్టర్ సువర్ణ అన్నారు.  వాతావరణ మార్పులను అంచనా వేసేందుకు సహాయపడటమే కాకుండా, పంటల కీటకాల నియంత్రణలో సహాయకారిగా ఉంటాయని చెప్పారు. పట్టణీకరణ, వాతావరణ మార్పులు, వేటగాళ్ల కారణంగా కొన్ని ప్రత్యేక పక్షుల జాతులు అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పక్షుల పరిరక్షణను సామాన్య ప్రజలు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వాలు కలిసికట్టుగా చేపట్టాలని సూచించారు.

NCF
NCF: పక్షుల గురించి వివరిస్తున్న అధికారి

ఇందిరా గాంధీ ఉదాహరణ

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే పక్షులపై ఆసక్తి చూపేవారని,  దాని ఫలితంగానే ఆమె పాలనలో పక్షుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. పక్షుల సంరక్షణను ఒక హాబీగా మార్చుకుంటే, ప్రకృతిని సమర్థవంతంగా అర్థం చేసుకోవచ్చని చెప్పారు.

 మాంజాతో పక్షులకు గాయాలు .. 

సంక్రాంతి పండుగ సమయంలో పతంగుల కోసం వాడే మాంజా దారాలతో అనేక పక్షులు గాయపడుతున్నాయని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి, మాంజా వినియోగాన్ని తగ్గించాలని కోరారు. అలాగే, దసరా పండుగ సందర్భంగా పాలపిట్టను బంధించడం నేరమని, సహజ వాతావరణంలోనే వీటిని ఆనందించాలన్నారు.

నగరాల్లో కాకుల కనుమరుగవడంపై ఆందోళన

పక్షుల జనాభాలో మార్పులు తలెత్తుతున్నాయని,  హైదరాబాద్ వంటి నగరాల్లో కాకులు కనుమరుగవుతున్నాయని, ఇవి కనిపిస్తే ఆశ్చర్యంగా మారిపోయిందని తెలిపారు. ఈ మార్పులు పర్యావరణ అసమతుల్యతకు సంకేతమని, ఇది పరిశీలనకు అవసరమైన అంశమని పేర్కొన్నారు.

NCF
NCF : హాజరైన అధికారులు, పక్షి ప్రేమికులు

కవ్వాల్ టైగర్ రిజర్వ్ పక్షుల బ్రోచర్ విడుదల

ఈ సందర్భంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో ఉండే పక్షుల వివరణతో కూడిన ప్రత్యేక బ్రోచర్‌ను విడుదల చేశారు.  పక్షుల జీవన విధానం, మైగ్రేషన్ తీరు, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్రపై నిపుణులు వివరించారు. కార్యక్రమంలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, సీసీఎఫ్ శరవణన్, అటవీ శాఖ అధికారులు శివ ఆశిష్ సింగ్, నీరజ్ కుమార్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్డ్స్ స్టడీస్ (రిషి వాలీ) డాక్టర్ శాంతారామ్, వెట్‌ల్యాండ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ గుజ్జా భిక్షం, బర్డ్స్ మైగ్రేషన్ స్టడీస్ నిపుణుడు డాక్టర్ సాతియా సెల్వం (BNHS), హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ఎన్జీఓ ప్రతినిధి సీతారాం రెడ్డి, బర్డ్ బయో జియోగ్రఫీ నిపుణుడు డాక్టర్ రాబిన్ విజయన్, మంచిర్యాల ఎఫ్‌డీఓ సర్వేశ్వర్ రావు, వరల్డ్ వైల్డ్ లైఫ్ అధికారులు ఫరిదా తంపాల్, బండి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *