ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పరస్పర విమర్శలు
ఆరోపణలు, ప్రత్యారోపణలలతో మానకొండూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత
రసమయి ఫామ్ హౌస్ ముట్టడికి తరలిన కాంగ్రెస్ కార్యకర్తలు
అడ్డుకున్న పోలీసులు.. చిగురుమామిడి ఠాణాకు తరలింపు
గుండారంలోని ఫామ్ హౌస్ లో రసమయి గృహ నిర్భందం
ట్విట్టర్ లో స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
కౌంటర్ ఇచ్చిన కవ్వంపల్లి
రీ కౌంటర్ ఇచ్చిన రసమయి
Rasamai vs Kavvampalli : మానకొండూర్ ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్య రసమయి బాలకిషన్ ల పరస్పర విమర్శలతో మానకొండూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ గా మారింది. సీఎంఆర్ఎఫ్ లో స్కాం జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే రమసయి బాలకిషన్ ఆరోపణలు చేయడం, కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్టయిన విషయం తెలసిందే. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామానికి సాగునీటి విషయమై ఎమ్మెల్యే కవ్వంపల్లి చేసిన విమర్శలు మానకొండూర్ నియోజకవర్గంలో పెనుదుమారం రేపుతున్నాయి.
మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే సవాళ్లు,ప్రతి సవాళ్ల నేపథ్యంలో మానకొండూర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలు బెజ్జంకి మండలం గుండారంలోని రసమయి బాలకిషన్ ఫాంహౌస్ ముట్టడికి తరలివెళ్లేందుకు బెజ్జంకికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఎక్కడికక్కడ హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. వారిని చిగురుమామిడి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇక ఇదే సమయంలో రసమయిని గుండారంలోని ఫాంహౌస్ లో హౌస్ అరెస్టు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతో తన ఫాంహౌస్ ను ముట్టడించమని స్వయంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి వాట్సప్ లో సందేశాలు పంపించి ఉసిగొల్పాడని మాజీ ఎమ్మెల్యే రసమయి ఆరోపించారు. అయితే తాను ఇలాంటి చిల్లర చేష్టలకు భయపడేవాడిని కాదని, ఉద్యమంలో 14 ఏళ్లు వెనకడుగు వేయకుండా పని చేశానని వీడియో రిలీజ్ చేశాడు. అదే సమయంలో కవ్వంపల్లిపై పలు ఆరోపణలు చేశారు. సీఎంఆర్ఎఫ్ స్కాంపై పలు ప్రశ్నలు సంధించారు. సీఎంఆర్ఎఫ్ స్కాంలో కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్టయిన విషయంపై ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి ఈ స్కామ్ కు సూత్రధారుడని, త్వరలో కవ్వంపల్లి జైలుకు వెళ్లక తప్పదని చెప్పుకొచ్చారు. అన్ని ఆధారాలు రాష్ట్ర డీజీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి కి మెయిల్ చేశామని చెప్పుకొచ్చారు.
ఎక్స్ లో హరీశ్ రావు ట్వీట్
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన కార్యకర్తలతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటిపై దాడి చేయించేందుకు ఉసిగొల్పాడని,
కాంగ్రెస్ కార్యకర్తలు రసమయి బాలకిషన్ ఇంటికి ఎలా వెళ్లాలి, పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలని వాట్సాప్ లో ఆదేశాలు ఇచ్చాడని ఎక్స్ లో ట్వీట్ పెట్టారు.
కవ్వంపల్లి కౌంటర్…
@BRSHarish
అనుచిత వ్యాఖ్యలు చేసి, సవాళ్లు విసిరి విజ్ఞత లేకుండా నిందారోపణలు చేశారు. ఆధారాలు చూపించి ధైర్యంగా ఎదుర్కోమంటే.. దాక్కున్న వైఖరిని మీరు సమర్థిస్తున్నారా? లేక ఏదో ఒక విధంగా విష ప్రచారాలు చేసి అభివృద్ధిని అడ్డుకునే మీ మాజీ ఎమ్మెల్యేకు మీరు అండగా నిలబడుతున్నారా?
సవాలు విసిరితే తీసుకోవడం రాజకీయ నాయకుడి ముఖ్య లక్షణం, దమ్ముంటే రండి అంటే దాక్కునే వైఖరి మాది కాదు, మేం ప్రజాస్వామ్యానికి కట్టుబడి వుండే సిద్ధాంతాలు కలిగిన వాళ్ళము.
ఓపిక నశించిన కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యే అనుచిత వ్యాఖ్యలు, అవాస్తవాల కట్టడి చేయాల్సిన బాధ్యత మీరు తీసుకుంటారా
అని కవ్వంపల్లి కౌంటర్ వేశారు.
రసమయి రీ కౌంటర్
Mr.@DrKavvampally దాక్కున్నది. హైదరాబాదు దాటి రానిది నువ్వు, ప్రజల మధ్య ఉంటుంది నేను. CM relief fund లో నీ కార్యకర్తలు మరియు నీవు చేసిన కుంభకోణం అబద్దమే అయితే నీ అనుచరులను పోలీసులు అరెస్టు ఎందుకు చేసినట్టు? నియోజకవర్గం లో పంటలు ఎండిపోయి రైతులు అన్నమో రామచంద్ర అంటూ పెద్దలింగాపూర్ రైతులు నీళ్ల కోసం కన్నీరు పెడుతుంటే పరమర్శించాల్సింది పోయి, వాళ్ళని అవమానిస్తూ మాట్లాడినందుకు వాళ్ల తరపున నేను ప్రశ్నించినందుకా దాడి? నువ్వు నీ అనుచరులను ఉసిగొల్పి నపై నువ్వు చేయించాలనుకుంటున్న దాడి కి భయపడే వ్యక్తిని కాదు. అమాయక కార్యకర్తలను బలిచేయడం ఎందుకు? దమ్ము ధైర్యం ఉంటే నువ్వే రా.. నీ కమిషన్లు దోపిడీ ఆధారాలతో సహా నేను వొస్త.. తేల్చుకుందాం రా కమీషన్ల నారాయణ. అని రాసుకొచ్చారు.
మరి ఈ ఇద్దరి నేతల మధ్య నెలకొన్న వివాదం ఎటు దారి తీస్తుంది. రసమయి ప్రశ్నలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి బదులిస్తాడా లేదా కాంగ్రెస్ కార్యకర్తలతో మరోసారి ధర్నాలు చేయిస్తాడా అనే చర్చ నియోజకవర్గంలో మొదలైంది. సీఎంఆర్ఎఫ్ స్కాం అంశాన్ని పక్కదారి పట్టించడానికే కాంగ్రెస్ కార్యకర్తలతో కవ్వంపల్లి ముట్టడికి ప్లాన్ చేశాడని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
శెనార్తి మీడియా, కరీంనగర్ ప్రతినిధి