- ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు..
- మాజీ ఎమ్మెల్యే రసమయి సంచలన ఆరోపణలు
Rasamai:రూ. 50 వేలు కొట్టు .. ఇందిరమ్మ ఇల్లు పట్టు’ అనే స్కామ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి సంచలన ఆరోపణలు చేశారు. శనివారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా ప్రజలకు ప్రయోజనం లేదన్నారు. మానకొండూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 42 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, కేవలం 3,500 మందికే మాత్రమే ఇండ్లు మంజూరు చేశారన్నారు. ఇది ఏ విధంగా న్యాయమో ప్రభుత్వమే చెప్పాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక గ్రామాల్లో ఎంపీడీవో ఆధ్వర్యంలో జరగాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అధికార పార్టీ నేతలు తమకు ఇష్టం వచ్చిన వారికి మాత్రమే ఇండ్లు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే ఇండ్లు దక్కుతున్నాయన్నారు.
“50 వేల కొట్టు ఇల్లు పట్టు” అన్నట్లుగా ప్రభుత్వ వ్యవహారం సాగుతున్నదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇండ్ల పేరిట డబ్బులు వసూలు చేసే దందా నడుస్తోందని ఆరోపించారు. వెంటనే నిరుపేదలకు న్యాయంగా ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో కమీషన్ల దందా జరుగుతుందని ఆరోపించారు. కలెక్టర్ గ్రామ సభ ఏర్పాటు చేసి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని కోరారు.
ఒక రిపోర్టర్ దగ్గరి నుంచి 50 వేల రూపాయలు తీసుకున్నట్టు సమాచారం ఉన్నదని, స్క్రీన్‌షాట్లు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు. త్వరలోనే అవి మీడియా ముందు ఉంచుతామని చెప్పారు. ఇదిలా ఉంటే, భారీ వర్షాలకు వడ్లు తడిసి మొలకెత్తుతున్నాయని, రైతులు ఇబ్బందిపడకుండా వడ్లు తక్షణమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, తిమ్మాపూర్
