- కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సభ్యుడు
Complaint to Collector: ప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘానికి గాజుల ముకేష్ గౌడ్ స్వయంగా కన్వీనర్‌గా ప్రకటించుకొని నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నాడని, తానే అన్నీ అంటూ సభ్యులపై పెత్తనం చేస్తూ అనేక దుర్వినియోగాలు చేస్తున్నాడని సంఘం సభ్యుడు కోల రాజ గౌడ్ ఆరోపించాడు. దీనిపై మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని, న్యాయం చేయాలని కోరారు.
115 మంది సభ్యులతో సంఘం ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ సంఘంలో144 మంది సభ్యులుగా ఉన్నారు. అయితే లెక్కలు, లావాదేవీలు ఏవీ పారదర్శకంగా లేవని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.50,00 -1,00,000 దాకా వసూలు చేసినా, వాటికి ఎలాంటి లెక్కలు చెప్పకుండానే ముకేష్ గౌడ్ స్వంత ఉపయోగాలకు వాడుకుంటున్నాడని ఆరోపించారు.
సభ్యులకు ఏటా రెండు విడతలుగా రూ.12,500 చొప్పున చెల్లించాల్సిన వాటాలో కేవలం రూ.8,700 మాత్రమే ఇస్తున్నాడని, మిగతా మొత్తాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపించారు. కన్వీనర్‌గా సేవల పేరుతో నెలకు రూ.2.80 లక్షలు, ఏడాదికి రూ.33.60 లక్షలు తీసుకుంటున్నాడని, ఇది సంఘ ఆదాయానికన్నా మించిపోయే స్థాయిలో ఉందని వివరించారు.
అంతటి డబ్బు తీసుకుంటున్నా సంఘానికి భవనం లేదని, భూమి లేదని, కనీస వసతులు కూడా లేకపోయినా ముకేష్ గౌడ్ మాత్రం రాజకీయ బలం నమ్ముకుని తమకు రావాల్సిన నిధులను దోచుకుంటున్నాడని రాజ గౌడ్ ఆరోపించారు. సంఘ నిబంధనలను విస్మరిస్తున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే సభ్యత్వం తొలగిస్తానని బెదిరిస్తున్నాడని చెప్పారు.
ఈ క్రమంలో కలెక్టర్ తదితర ఉన్నతాధికారులు ముకేష్ గౌడ్ ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టి, అతన్ని పదవి నుంచి తప్పించాలని, సభ్యులకు రావలసిన నిధులను రికవరీ చేయాలని రాజా గౌడ్ కోరారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
