డీసీపీ ఎగ్గడి భాస్కర్
DCP Macherial: మంచిర్యాల జోన్ పరిధిలో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ కఠిన చర్యలు తీసుకుంటున్నాయని డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. ఈ సంవత్సరం ఆగస్టు వరకు 81 మందిని పట్టుకున్నట్లు చెప్పారు. మొత్తం 114 ఫిర్యాదులు అందగా, వాటిలో 18 క్రిమినల్ కేసులు, 7 పెట్టి కేసులు నమోదు చేసి, 89 మందికి కౌన్సిలింగ్, వార్నింగ్ ఇచ్చినట్లు వివరించారు.
డీసీపీ కార్యాలయంలో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో షీ టీమ్, మహిళా పోలీస్ స్టేషన్, భరోసా సెంటర్ సిబ్బందితో సమావేశమై పలు సూచనలు జారీ చేశారు. హాట్ స్పాట్స్‌ను ప్రతిరోజూ సందర్శించి ఈవ్‌టీజర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని సూచించారు. స్కూళ్లు, కళాశాలలు, జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మహిళా హాస్టల్స్‌లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్, మహిళ ఇన్చార్జి తప్పనిసరిగా ఉండాలని అన్నారు. భరోసా సెంటర్లో వైద్యం, కౌన్సిలింగ్, లీగల్ సహాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని తెలిపారు. చిన్నారులపై పోర్న్, అత్యాచార వీడియోలు స్టోర్ చేయడం, అప్లోడ్ చేయడం, షేర్ చేయడం ఐటీ యాక్ట్, పోక్సో చట్టాల ప్రకారం నేరమని హెచ్చరించారు. వేధింపులకు గురైన మహిళలు భయపడకుండా వెంటనే షీ టీమ్‌ను సంప్రదించాలని సూచించారు.
ఫిర్యాదు వివరాలు గోప్యంగా ఉంచుతామని, వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రామగుండం షీ టీం వాట్సాప్ నెంబర్ 6303923700, మంచిర్యాల షీ టీం 8712659385 లేదా 100 నెంబర్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఈ సమావేశంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, మంచిర్యాల జోన్ షీ టీం ఇన్చార్జి ఎస్సై ఉషారాణి, భరోసా సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల:
