BMS
వినతి పత్రం అందజేస్తున్న బీఎంఎస్ నాయకులు

BMS : పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

  • సింగరేణి యాజమాన్యంపై బీఎంఎస్ ఫైర్
  • డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేత

BMS : సింగరేణి సంస్థలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను వెంటనే ప్రకటించాలంటూ బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. రామగుండం పర్యటనలో ఉన్న సింగరేణి డైరెక్టర్ (పీపీ అండ్ పీఏడబ్ల్యూ) వెంకటేశ్వర్లుకు బీఎంఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ.. శ్రీరాంపూర్ ఏరియాలో గత నాలుగేళ్లుగా ఫ్యాన్ ఆపరేటర్లు, బిట్ శార్పనర్లు తదితర విభాగాలలో కార్మికులు యాక్టింగ్ లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఖాళీలను ప్రకటించకుండా, పదోన్నతులను వాయిదా వేస్తూ యాజమాన్యం కార్మికుల శ్రమను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. సింగరేణి సంస్థలో పారదర్శకంగా పదోన్నతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్మికుల సమస్యలు విన్న డైరెక్టర్ ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు.

గైర్హాజరు కార్మికులపై వేధింపులు అనుచితం..
వివిధ అనివార్య కారణాలతో విధులకు హాజరు కాలేకపోతున్న కార్మికులను విచారణల పేరుతో వేధించడం, ఉద్యోగాల నుంచి తొలగించడం సింగరేణి యాజమాన్యానికి తగదు అని బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు యాదగిరి సత్తయ్య విమర్శించారు. అనారోగ్యంతో బాధపడే కార్మికులకు అండగా ఉండాల్సిన యాజమాన్యం, ఒత్తిడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అలాంటి ఉద్యోగులను తిరిగి పునరుద్ధరించాలని, కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి రాగం రాజేందర్, నాయకులు తిరునహరి కిరణ్ కుమార్, బుర్ర అరుణ్ కుమార్, ఆషాడపు రమేష్, చల్ల వేణు తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *