- నెల రోజుల్లో రెండోసారి ఘటన
- డబ్బుల కోసం ప్రాణాలు తీస్తున్నారంటున్న బాధితులు
- ప్రాణాలతో చెలగాటమాడుతున్న హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Touch Hospital : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్‌లో వైద్యం కోసం వెళ్తున్న రోగులను సదరు హాస్పిటల్ యాజమాన్యం డబ్బుల కోసం మార్చురీకే పంపిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ హాస్పిటల్లో ఇదే పునరావృతవమవుతున్నది. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.
టచ్ ధన దాహానికి నెలక్రితం ఒకరు బలి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన కొంగ శ్రీనివాస్ (45) కు 2024 డిసెంబర్ 24న రాత్రి సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అతడిని మంచిర్యాలలోని టచ్ దవాఖానకు తీసుకెళ్లారు. రోగి పరిస్థితి సీరియస్ గా ఉందని వెంటనే చికిత్స చేయాలని, రూ.1.80 లక్షల ప్యాకేజీ చెప్పారు. వెంటనే సదరు దవాఖాన నిర్వాహకులు బాధిత కుటుంబం నుంచి రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. ఆ తర్వాత చికిత్స ప్రారంభించారు. చికిత్స ప్రారంభమైన గంటలోపే శ్రీనివాస్ చనిపోయాడు. అయితే మృతదేహాన్ని మాత్రం రాత్రి తీసుకెళ్లనివ్వలేదు. మరుసటి రోజు ఉదయం బాధిత కుటంబం హాస్పిటల్ నిర్వాహకులను సంప్రదించగా, బిల్లు రూ.4.50 లక్షలు దాకా అయ్యిందని, మిగతా రూ. మూడు లక్షలు చెల్లించాకే మృతదేహాన్ని అప్పగిస్తామని హాస్పిటల్ యాజమాన్యం బాధిత కుటుంబానికి స్పష్టం చేసింది. హాస్పిటల్ యాజమాన్యం తీరుతో కుటుంబ సభ్యులు ఆవేదనతో కన్నీరు మున్నీరుగా విలపించారు.
నెలరోజుల్లోనే మరోసారి..
2025 జనవరి 31న కూడా మళ్లీ అదే సంఘటన పునరావృతమైంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లికి చెందిన ముత్తెం రాజేశ్వరి (55) గుండె సమస్యతో జనవరి 30న సాయంత్రం సమయంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్లో చేరింది. వైద్యులు రెండు స్టంట్స్ వేయగా, వైద్యం వికటించి చనిపోయిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఈ టచ్ హాస్పిటల్ కు అనారోగ్యంతో వెళితే వెళ్తే ప్రాణం మీద ఆశలు వదులు కోవాల్సిందేనంటున్నారు బాధితులు. అయితే డబ్బులు కడితే తప్ప స్టంట్ వేయకుండా ఆసుపత్రి యాజమాన్యం గంట పాటు ట్రీట్మెంట్‌ను సైతం ఆపారని బాధితులు ఆరోపిస్తున్నారు.

బంధువుల ఆందోళన
వైద్యం వికటించి మహిళ చనిపోవడంతో ఆమె బంధువులు దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులు గుండెకు అంజియోగ్రం చేసి, రెండు స్టంట్స్ వేశారని, ఆపరేషన్ విఫలం కావడంతో మృతి చెందిందని బంధువలు ఆరోపిస్తున్నారు. డబ్బులు కట్టించుకొని ట్రీట్ మెంట్ చేస్తున్నామని చెప్పారని, కనీసం పెషెంట్ ను ఒక్కసారి కూడా చూడనివ్వలేదని ఆరోపిస్తున్నారు. డబ్బుల కోసం ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. బంధువుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున హాస్పిటల్ కు చేరుకున్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల