GATTU MALLANNA : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న నాలుగో గిరి ప్రదక్షిణ ఆదివారం భక్త జనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి నెలా ఆరుద్ర నక్షత్రాన నిర్వహించే గిరి ప్రదక్షిణ సురేష్ అత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో ఓం నమ: శివాయ, హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివ నామస్మరణలతో, జై శ్రీరాం నినాదాలతో భక్తులు గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ జరిపారు. అనంతరం గుట్ట మీద ఆలయంలోని గట్టు మల్లన్నను దర్శించుకున్నారు. సుమారు 1500 మందికిపైగా భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల కోసం అన్నదానంతో పాటు ప్రయాణం నిమిత్తం టీజీఎస్ ఆర్టీసీ మంచిర్యాల నుంచి ప్రత్యేక వాహనాన్ని సైతం ఏర్పాటు చేసింది.

యువత భక్తి మార్గం అవలంభించడం శుభపరిణామం
యువత సైతం భక్తి మార్గం అవలంభించడం శుభపరిణామమని, గిరి ప్రదక్షిణ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో యువతీ, యువకులు పాల్గొంటున్నారని సురేష్ అత్మరాం మహారాజ్ పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం ఆలయం ముందు విలేకరులను, భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడారు. యువకులే ధర్మరక్షా సైనికులని, వారు ముందుకు వస్తుండటం శుభపరిణామమన్నారు. భారత్ దేశం అన్నపూర్ణ దేవి అని, అందరికి అన్నం పెట్టి అతిథులను దేవుడిలా భావించి అన్నం పెట్టామన్నారు. ఈ రోజు వారే హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శివుడికి మాగ మాసం శివుడికి మహా ఇష్టమని, వేలాల గుట్ట మీద పంచ పాండవులతో పూచించబడ్డ గట్టు మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా రావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చొప్పకట్ల శ్రీకాంత్, గిరి ప్రదక్షిణ కమిటీ సమితీ సభ్యులు రాజేశ్ శర్మ, కర్ణకంటి రవీందర్, ప్యాగ లక్ష్మణ్, డేగ నగేష్ పటేల్, రాజా రమేష్, రాఘవేంద్ర స్వామి, సదనపు సంతోష్, రమేష్ గౌడ్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు రవీందర్, చత్రపతి శివాజీ సేవా సమితి వ్యవస్థాపకులు ఉదయ్ కిరణ్, పూదరి రవీందర్, మల్క ప్రతాప్, వేలాల గ్రామ స్పెషల్ ఆఫీసర్ విద్యా సాగర్, సీపీఓ సత్యంతో పాటు అధికారులు, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల