MJ BPhule :సామాజిక రుగ్మతలను రూపుమాపి బహుజనుల అభివృద్ధికి కృషిచేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీ చౌరస్తా వద్ద మహాత్మా పూలే విగ్రహం వద్ద 199వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్ పాల్గొన్నారు. బీసీ సంఘాల నేతలు, అధికారులు మహాత్మా పూలే విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు సమర్పించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పూలే వంటి సంఘసంస్కర్తల కృషివల్లే సమాజం చైతన్యవంతంగా మారిందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలతోనే బీసీ కుల గణన చేపట్టారని, రిజర్వేషన్ కోసం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి సమీప చౌరస్తా అభివృద్ధికి రూ.15 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు.
కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ చదువే బహుజన అభివృద్ధికి మార్గమని, మహిళా విద్యకు పూలే ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేశారు. వితంతు మహిళల కోసం ఆశ్రమాలు నెలకొల్పినట్టు తెలిపారు.
కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ పూలే ప్రజలను చైతన్యపరిచినవాడని, సావిత్రిబాయి పూలేను తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనన్నారు.
సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పూలే కుల, మత, లింగ, వర్ణ భేదాలను ఖండించిన మహనీయుడని, భావితరాలు ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జ్యోతిబా పూలే రచించిన పుస్తకం, దాని తెలుగు , ఇంగ్లీష్ అనువాదాలు ఆవిష్కరించారు. బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, బీసీ సంఘాల నేతలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, కరీంనగర్