- జపాన్ ‘సకురా’కు శ్రీవల్లి
- అభినందనలు తెలిపిన డీఈఓ, విద్యాశాఖ అధికారులు
JAPAN SAKURA : అంతర్జాతీయ సైన్స్ సదస్సుకు జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని సాయిలు సాయిశ్రీవల్లి ఎంపికయ్యారు. జపాన్ లో జూన్ 15 నుంచి 21 వరకు జరుగనున్న ‘సకురా’ సైన్స్ ఎక్సేంజ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. శ్రీ చైతన్య పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీవల్లి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి జపాన్‌లో నిర్వహించనున్న సకురా సైన్స్ సదస్సుకు ఎంపికై అందరి అభినందనలు పొందుతుంది.
దేశ వ్యాప్తంగా 54.. తెలంగాణలో ముగ్గురు ఎంపిక…
అంతర్జాతీయ సైన్స్ సదస్సుకు దేశ వ్యాప్తంగా 54 మంది విద్యార్థులు ఎంపిక కాగా, తెలంగాణ నుంచి ముగ్గురికి మాత్రమే ఈ అరుదైన అవకాశం లభించింది. ఈ ముగ్గురిలో మంచిర్యాల జిల్లా విద్యార్థిని శ్రీవల్లి ఒకరు కావడం గమనార్హం. శ్రీవల్లి జపాన్ పర్యటన ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. జపాన్ ప్రభుత్వం సకురా సైన్స్ హై స్కూల్ ప్రోగ్రాం ద్వారా వారి దేశ సందర్శనకు అవకాశం కల్పించింది.

శ్రీస్ రుతుమిత్ర కిట్ తో గుర్తింపు…
స్త్రీలలో నెలసరి సమయంలో ఉపయోగించే రసాయనిక శానిటరీ ప్యాడ్‌ల వల్ల కలిగే ఇబ్బందులను పరిష్కరించేందుకు సాయిశ్రీవల్లి రూపొందించిన ‘శ్రీస్ రుతుమిత్ర కిట్’ ప్రాజెక్టును రూపొందించింది. ఈ ప్రాజెక్టుతో శ్రీవల్లి జాతీయస్థాయిలో ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్‌లో 2020-21లో జరిగిన ఇన్ స్పైర్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రదర్శన ఇచ్చి తన ప్రతిభను చాటుకుంది. అంతేకాకుండా 2023లో ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ పాల్గొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక ప్రశంసలు అందుకుంది.

అభినందనలు తెలిపిన డీఈఓ, విద్యాశాఖ అధికారులు…
జపాన్ సకురా సైన్స్ సదస్సు కార్యక్రమానికి ఎంపికైన సాయిశ్రీవల్లిని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. యాదయ్యతో పాటు జిల్లా సైన్స్ అధికారి ఎస్. మధుబాబు, సెక్టోరల్ అధికారులు శ్రీనివాస్, చౌదరి, సత్యనారాయణ మూర్తి, యశోధర, శ్రీ చైతన్య పాఠశాల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం అరవింద్ రెడ్డి, ప్రిన్సిపల్ జోబిన్ లు సహా పలువురు అభినందనలు తెలిపారు. ఈ అరుదైన అవకాశం ద్వారా శ్రీవల్లి జపాన్‌లో సాంకేతికతపై అవగాహన పెంచుకుని, తన ఆవిష్కరణలతో మరింత ముందుకు సాగాలని కోరారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల :