Kyathanapally Muncipal
Kyathanapally Muncipal: మాట్లాడుతున్న సీపీఐ నాయకుడు కలవేన శంకర్

Kyathanpally Municipal: క్యాతనపల్లిలో ప్రజాస్వామ్యం ఖూనీ

  • మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకంపై సిపిఐ ధ్వజం
  •  మహిళా కౌన్సిలర్లపై దాడులు సిగ్గుచేటు: కలవేన శంకర్

Kyathanpally Municipal: క్యాతనపల్లి మున్సిపాలిటీ సాక్షిగా సాగుతున్నది ప్రజాస్వామ్య పాలన కాదని, ఇది అచ్చమైన గూండా రాజకీయం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణల కనుసన్నల్లోనే ఈ అరాచకాలు జరగడం శోచనీయమన్నారు.

కాకా ఆశయాలకు తూట్లు
సింగరేణి కార్మికుల పక్షపాతిగా పేరున్న వెంకటస్వామి (కాకా) ఆశయాలను ఆయన వారసులు మంటగలుపుతున్నారని శంకర్ ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాల కోసం గూండాలను ప్రోత్సహిస్తూ కాకా సంపాదించిన పేరును నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. కౌన్సిల్ హాల్ తలుపులు మూయించి, మీడియాను రాకుండా అడ్డుకుని చీకటి రాజకీయం నడపడం వారి దిగజారుడు తనానికి పరాకాష్ట అని విమర్శించారు.

మహిళా ప్రతినిధులపై దాడులు అమానుషం
కౌన్సిల్ హాల్‌లోనే మహిళా ప్రతినిధులపై భౌతిక దాడులు జరగడం సభ్య సమాజం తలదించుకునే చర్య అని శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 8వ వార్డు గిరిజన అభ్యర్థి మణిపై గుర్రపు శీను అనే వ్యక్తి దాడికి తెగబడటం, చైర్మన్ అభ్యర్థిగా ఉన్న ఒక మహిళా డాక్టర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం అమానుషమన్నారు. అసభ్యంగా ప్రవర్తించిన గుర్రపు శీనును వెంటనే కౌన్సిలర్ పదవి నుండి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అధికారుల తీరుపై మండిపాటు
ఎన్నికల సంఘం పాస్ లు జారీ చేసినా మీడియాను లోపలికి అనుమతించకపోవడం వెనుక అధికారుల కుట్ర దాగి ఉందని శంకర్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులతో అధికారులు కుమ్మక్కై లోపల జరుగుతున్న అరాచకాలను దాచిపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. సిసిటివి ఫుటేజ్ బయటపెట్టకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ ఎన్నికల నిర్వహణ అధికారి ప్రజలకు వాస్తవాలు వివరించాలని డిడ్ చేశారు. అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా బుధవారం చేపట్టిన క్యాతనపల్లి బంద్‌ను విజయవంతం చేసిన వ్యాపారులకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *