farmers urea protest: సాగు పనుల్లో బిజీగా ఉండాల్సిన అన్నదాతలు, యూరియా బస్తాల కోసం రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడింది. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
క్యూలైన్లలో వేచి చూసినా దక్కని యూరియా
తాడికల్ పీఏసీఎస్ ఎరువుల గోదాం వద్దకు తెల్లవారుజాము నుంచే రైతులు భారీగా తరలివచ్చారు. తీరా గోదాం వద్దకు వెళ్లాక ‘యూరియా స్టాక్ లేదని’ అధికారులు చెప్పడంతో రైతుల సహనం నశించింది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి, ఎరువుల కోసం అల్లాడుతున్న తమను అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన రహదారిపై బైఠాయింపు
రైతులకు మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు రంగంలోకి దిగడంతో నిరసన ఉధృతమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పంట చేతికి వచ్చే సమయంలో ఎరువులు లేకపోతే మా పరిస్థితి ఏంటి? ప్రభుత్వాలు ఎందుకు ముందుచూపుతో వ్యవహరించడం లేదు..? అని రైతులు నిలదీశారు.
హామీతో సద్దుమణిగిన ఉద్రిక్తత
ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) భాగ్యలక్ష్మి స్పందిస్తూ.. రైతులకు ఇబ్బంది కలగకుండా ఈరోజు సాయంత్రం లోపు 20 మెట్రిక్ టన్నుల యూరియాను తాడికల్ గోదాంకు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన హామీ రావడంతో రైతులు తమ నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంగళ ప్రవీణ్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మహిపాల్‌తో పాటు పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. సాయంత్రం కల్లా ఎరువులు అందుతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు
శెనార్తి మీడియా, శంకరపట్నం:
