BRS vs Congress
BRS vs Congress

BRS vs Congress: క్యాతనపల్లి చైర్మన్ పీఠంపై ఉత్కంఠ

  • బీఆర్ఎస్ క్యాంపు వద్ద కలకలం..
  • బీఆర్ఎస్ కౌన్సిలర్లను తరలించేందుకు కాంగ్రెస్ యత్నించింది
  • చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపణలు
  • ముందే పసిగట్టి మరోచోటికి తరలింపు

BRS vs Congress: క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ పదవి చుట్టూ రాజకీయ వాతావరణం తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలతో బీఆర్ఎస్ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టి దొడ్డిదారిలో అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భద్రాచలంలోని ఓ హోటల్‌లో బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు క్యాంపులో ఉన్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌన్సిలర్లను చెదరగొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు హోటల్ వద్ద తనిఖీలు చేపట్టడంతో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. ముందస్తు సమాచారం అందుకున్న మాజీ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అప్రమత్తంగా వ్యవహరించి కౌన్సిలర్లను అక్కడి నుంచి సురక్షితంగా తరలించినట్లు సమాచారం.

దారిపొడవునా పర్యవేక్షణ

భద్రాచలం నుంచి క్యాతనపల్లికి కౌన్సిలర్ల తరలింపులో ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించారు. భద్రాచలం, మంగపేట, ములుగు, ఏటూరు నాగారం, కాటారం, చెన్నూరు ప్రాంతాల్లో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసి దారిపొడవునా పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. అనంతరం కౌన్సిలర్లను చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లిలో ఉన్న తన నివాసానికి తరలించినట్లు బాల్క సుమన్ వర్గాలు వెల్లడించాయి. అక్కడ పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను మొహరింపజేశారు.

ప్రజా తీర్పు గౌరవించాలి

BRS vs Congress Balka Suman
BRS vs Congress Balka Suman

సోమవారం జరగనున్న చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని బాల్క సుమన్ తెలిపారు. ప్రజలు తమకు పూర్తి మెజారిటీ ఇచ్చారని, అయినప్పటికీ అధికార పార్టీ అనుచిత మార్గాల్లో పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.

క్యాతనపల్లి చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో కొనసాగుతున్న ఈ రాజకీయ పరిణామాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. సోమవారం జరిగే ఎన్నికలో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *