- వేలాల గట్టు మల్లన్న, కత్తెరశాల మల్లన్న ఆలయాలకు పోటెత్తిన భక్తులు
- స్వామి వారలనుదర్శించుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, డీసీపీ భాస్కర్
Maha Shivaratri Jatara:మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ఆధ్యాత్మిక ఉత్సాహం తారాస్థాయికి చేరింది. వేలాల గట్టు మల్లన్న ఆలయం, కత్తెరశాల మల్లన్న ఆలయం వద్ద జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆలయాలను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.
గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కొండపై వెలసిన మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రత్యేక పూజలు, ఒగ్గు డోలు నాదాలు, హారతులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తన భార్య సరోజాతో కలిసి ఆలయాన్ని దర్శించారు. కాన్వాయ్ కారణంగా భక్తులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో గుట్ట అడుగునుంచి సుమారు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి స్వామివారిని దర్శించడం విశేషంగా నిలిచింది. అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆహ్వానించగా, ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు.

అనంతరం చెన్నూరు పట్టణంలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని ర్యాలీలో నడిచారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వేలాల ఆలయానికి రోడ్డు సౌకర్యం కల్పించేందుకు అటవీ అనుమతులు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. భక్తులకు ట్రాఫిక్, త్రాగునీరు, వసతి సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. ప్రతి నెల గిరి ప్రదక్షిణ ప్రారంభించామని, భవిష్యత్తులో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కత్తెరశాల మల్లన్న ఆలయ అభివృద్ధికి రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు వివరించారు.
జాతర సందర్భంగా భారీ రద్దీ దృష్ట్యా సుమారు 700 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆలయాన్ని సందర్శించగా అధికారులు శాలువాతో సన్మానించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

జాతర విజయవంతానికి ఆలయ ఈవో రమేష్, అధికారులు శ్రీకాంత్, అర్చకుడు ప్రదీప్ శర్మ సమన్వయం చేశారు. భక్తుల భారీ రద్దీ మధ్య శివనామస్మరణలతో జాతర ఘనంగా కొనసాగింది.
-శెనార్తి మీడియా, మంచిర్యాల:
