BAG WAIT 42.55 KGS
40 కిలోల బస్తా ధాన్యంకు 42.55 కిలోలు తూకం వేసిన కేంద్రం నిర్వాహకులు

WEIGHING @ 42 KGS : ధాన్యం కొనుగోళ్లు @ 42 కిలోలు…

  • తూకం తగ్గేదే లేదు…
  • తలలు పట్టుకుంటున్న రైతన్నలు…

WEIGHING @ 42 KGS : ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ధాన్యం పండించేందుకు రైతన్న ఎంత కష్టపడ్డాడో.. దానిని అమ్ముకునేందుకు రెట్టింపు కష్టపడాల్సి వస్తోంది… నిన్న మొన్నటి వరకు పంట ఆఖరు వరకు తడి ఇచ్చేందుకు నీటి కోసం అరగోస పడ్డ రైతన్న ఎట్టకేలకు పంటను కాపాడుకొని.., కోతకోసి.. ఆరబెట్టి.. ఇప్పుడు ఆగమాగమైతండు. రైతులు పండించిన పంటకు సవాలక్ష షాకులు చూపుతున్న మిల్లర్లు సివిల్ సప్లయ్ కి ఇచ్చే ధాన్యం నాణ్యమైనదే ఇస్తున్నారా..? అంటే అది ఏ మాత్రం లేదు. అలాంటప్పుడు రైతులకే ఎందుకు ఇన్ని కండీషన్లతో కోతలు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు.

WEIGHING
బస్తా తూకం 42.50 కిలోలు జోకిన హమాలీలు

తూకం 42 కిలోలకు తగ్గేదే లేదు…
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఆరినంక తూకం వేసి మిల్లులకు తరలించాల్సి ఉంటుంది. ఇక్కడే రైతన్నను నిలువునా ముంచుతుండ్రు. ఎంత మంచిగా ఉన్న తాలు, తప్ప అంటూ లేనిపోని షాకులు చూపుతూ 40 కిలోల బస్తాకు రెండు కిలోలపైన అంటే 42 కిలోల పైగ తూకం వేస్తూ రైతులను నట్టేట ముంచుతుండ్రు. ధాన్యం ఎంత మంచిగా ఉన్నతూకం తగ్గేదే లేదు.. ఒప్పుకోకుంటే కుప్ప ముట్టేదే లేదు.. నానా తంటాలు పడి కాంటా పెట్టిస్తే లారీ అన్ లోడ్ అయ్యేదే ఉండదు. ఇగ రైతన్న చేసేదేం లేక మిల్లర్లు చెప్పినట్టు తల ఊపి కోతకు ఒప్పుకొని వచ్చుడే తన వంతవుతుంది.

తలలు పట్టుకుంటున్న రైతన్నలు…
ఓ వైపు భానుడి ప్రతాపంతో ఎండలు 42 డిగ్రీలు దాటి దంచి కొడుతుంటే ఓర్చుకొని పని చేసుకుంటున్న రైతన్న మిల్లర్లు బస్తాకు 42 కిలోల పైన తూకం వేస్తుంటే తట్టుకోలేక కనిపించని ఆ దేవుడి కోసం మబ్బులవైపు చూసుడే దిక్కైతుంది. తలలు పట్టుకొని ఆకాశంవైపు చూస్తు రైతులను ఆదుకునే దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులైనా రైతులకు దేవుడిలా మారుతారంటే ఇలా వచ్చి.., నాలుగు మాటలు మాట్లాడి అలా వెళుతున్నారే తప్ప అధికంగా ఎందుకు తూకం వేస్తున్నారంటూ అడిగిన నాథుడే కరువయ్యారు. పైగా మిల్లర్ కు సఫోర్టుగా ధాన్యంతో తాలుందని, తూర్పార పట్టాలంటూ ఉచిత సలహాలిస్తున్నారే తప్ప రైతుకు అండగా నిలువడం లేదని వాపోతున్నారు.

– శెనార్తి మీడియా, కరీంనగర్ / ఆదిలాబాద్ :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *