Multi Shoping Malls : దేశవ్యాప్తంగా పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్, రిటైల్ రంగంలోని వేగవంతమైన మార్పులు అనేక దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లను భారత మార్కెట్ వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, 2026 నాటికి దేశంలోని ఏడుగ్రేటర్ నగరాల్లో 166 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనేక కొత్త షాపింగ్ మాల్స్ ఏర్పాటుకాబోతున్నాయని కన్సల్టింగ్ సంస్థ అనరాక్ వెల్లడించింది.
హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాలు ఈ కొత్త షాపింగ్ మాల్స్ సరఫరాలో సగానికి పైగా వాటా కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నగరాల్లో జరిగే అభివృద్ధి మొత్తం సరఫరాలో 65 శాతం ఉండనుంది. మిగిలిన మేటి నగరాలైన ముంబై, బెంగళూరు, చెన్నై, పూణే, కోల్‌కతా కూడా ఈ అభివృద్ధిలో భాగం కాబోతున్నాయి.
గ్రేడ్ A మాల్స్ కొరత వల్లే విస్తరణ
ప్రస్తుతం టాప్ నగరాల్లో కొత్త గ్రేడ్ -ఏ మాల్స్ కొరత స్పష్టంగా కనిపిస్తున్నట్లు అనరాక్ రిటైల్ సీఈఓ అనుజ్ కేజ్రీవాల్ తెలిపారు. గత మూడు సంవత్సరాల గణాంకాల ప్రకారం, కొత్త మాల్స్ సరఫరా కంటే లీజింగ్ డిమాండ్ ఎప్పటికీ అధికంగానే ఉందని పేర్కొన్నారు. ఉదాహరణకు, 2022లో 2.6 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్ -ఏ మాల్స్ అందుబాటులోకి రాగా, 3.2 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇచ్చారు. 2023లో ఈ గ్యాప్ మరింత పెరిగింది. 5.3 మిలియన్ చదరపు అడుగుల సరఫరాకు 6.5 మిలియన్ చదరపు అడుగుల డిమాండ్ ఉంది.
2024లో సరఫరా మరింత తగ్గే అవకాశం
ఈ ఏడాది సాధారణ ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల ప్రభావంతో కొత్త మాల్స్‌కు అనుమతులు ఆలస్యం కావడంతో సరఫరాలో మరింత కోత ఏర్పడే అవకాశం ఉందని సంస్థ హెచ్చరించింది. 2024లో కొత్తగా అందుబాటులోకి వచ్చే గ్రేడ్-ఏ మాల్స్ విస్తీర్ణం కేవలం 1.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని అంచనా. అదే సమయంలో లీజింగ్ డిమాండ్ 6.5 మిలియన్ చదరపు అడుగులకు మించనుంది.
రాబోయే రెండు ఏళ్లలో భారీ లీజింగ్
అనరాక్ నివేదిక ప్రకారం, రాబోయే రెండేళ్లలో దేశంలోని టాప్ 7 నగరాల్లో మాల్స్‌లో లీజింగ్ విస్తీర్ణం 12.6 మిలియన్ చదరపు అడుగులని దాటి పోతుంది. పసిఫిక్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ బన్సాల్ ప్రకారం, టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా రిటైల్ విస్తరణ పెరుగుతుండగా, మెట్రో నగరాలు మాత్రం ఆధిపత్యం చాటుకుంటున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం పసిఫిక్ గ్రూప్ ఢిల్లీ, ఘజియాబాద్, ఫరీదాబాద్, డెహ్రాడూన్లలో 9 షాపింగ్ మాల్స్ కలిగి ఉంది. ఇవి కలిపి దాదాపు 30 లక్షల చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని కలిగి ఉన్నట్లు వివరించారు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం ఈ విస్తరణలో అగ్రగామిగా మారుతుందని ట్రెహాన్ ఐరిస్ ప్రాజెక్టుల వైస్‌ప్రెసిడెంట్ ప్రలయేష్ గుహా అభిప్రాయపడ్డారు.