ACP MADHAVI
గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న హుజురాబాద్ ఏసీపీ మాధవి

CYBER CRIME : ఆశ, అత్యాశలే సైబర్ నేరగాళ్ల ఆయుధాలు

  • డబ్బులు పోయాక బాధపడటం కంటే ముందే జాగ్రత్త అవసరం
  • హుజురాబాద్ ఏసీపీ మాధవి

CYBER CRIME : ఆశ, అత్యాశలనే ఆయుధాలుగా చేసుకుని ప్రజలను వంచించి వారి కష్టార్జితాన్ని దోచుకోవడమే సైబర్ నేరగాళ్ల లక్ష్యమని హుజురాబాద్ ఏసీపీ మాధవి (ACP MADHAVI) పేర్కొన్నారు. సోమ వారం ‘శెనార్తి మీడియా’తో మాట్లాడుతూ తరచూ సైబర్ నేరగాళ్ల ఊబిలో పడి నష్టపోతున్న అమాయక ప్రజలకు అవగాహన కోసం పలు సూచనలు చేశారు. మనకు ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు ఉచితంగా ఎలాంటి ఆర్థిక లాభాలు కల్పించరన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.

విలాసవంతమైన వస్తువులు ఇస్తామని, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని, విదేశీ యాత్రలకు పంపుతామని రకరకాల మాయమాటలతో ఆఫర్లు ప్రకటిస్తూ సైబర్ నేరగాళ్లు ప్రజలను మభ్యపెడుతుంటారని, అలాంటి వారి మాయమాటలను గమనించాలన్నారు. ఏదో ఒక సంస్థ పేరిట మొదట సభ్యత్వాలు స్వీకరించి, తర్వాత మరికొందరిని సభ్యులుగా చేర్పిస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తుంటారని వెల్లడించారు. అలాగే ఫేస్‌బుక్ (FACE BOOK), వాట్సాప్ (WHATS APP), టెలిగ్రామ్ (TELIGRAM), ఇన్‌స్టాగ్రామ్ (INSTAGRAM), యూట్యూబ్(YOU TUBE), ఈమెయిల్ (E MAIL), ఫోన్ కాల్స్ (PHONE CALLS) ద్వారా వచ్చే ఆకర్షణీయ ఆఫర్లకు ఎట్టి పరిస్థితుల్లో లొంగవద్దని, తొందరపాటు నిర్ణయాలతో నష్టాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు.

  • నమ్మకం కలిగించి.. నట్టేట ముంచే ప్రయత్నం…

ప్రస్తుతం సైబర్ నేరాలు జరుగుతున్న తీరును ప్రజలు గమనించి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏసీపీ మాధవి సూచించారు. మొబైల్‌కు లేదా సోషల్ మీడియా వేదికల ద్వారా వివిధ కంపెనీల పేర్లతో లింకులు పంపించి, వాటిని ఇన్‌స్టాల్ చేయించి, తర్వాత రిజిస్ట్రేషన్ చేయిస్తారని, అనంతరం వాట్సాప్ గ్రూపులో చేర్చి, నకిలీ పెట్టుబడులు, లాభాల పత్రాలను చూపించి నమ్మకం కలిగిస్తున్నారని వివరించారు. మొదట తక్కువ మొత్తాలకు వెంటనే లాభాలు ఇచ్చి నమ్మకం పెంచి, తర్వాత ఎక్కువ మొత్తాలు పెట్టించినప్పుడు స్పందించకుండా మోసం చేస్తున్నారని అన్నారు.

  • నెక్స్ట్ లెవల్ అంటూ…

మరో విధానంలో ‘నెక్స్ట్ లెవల్’ అంటూ ఒకరి కింద మరొకరిని చేర్పించాలని, వారం చివరలో విజయ సమావేశాలు నిర్వహించి ఎక్కువ మందిని చేర్చించేలా ప్రోత్సహిస్తారని ఏసీపీ మాధవి వివరించారు. ఎక్కువగా జాయిన్ చేసిన వారిని సత్కరిస్తూ మరింత మందిని జాయిన్ చేయించేలా (చైన్ సిస్టంను) ప్రోత్సహిస్తు భారీగా పెట్టుబడులు వచ్చాక ఒక్కసారిగా కంపెనీ మూసేసి పరారయ్యే ఘటనలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

ACP MADHAVI HUZURABAD
హుజురాబాద్ ఏసీపీ మాధవి
  • 1930 కి ఫిర్యాదు చేయాలి…

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాలలో అనుకోకుండా వారి మాయలో పడి మోసపోయినట్లయితే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని ఏసీపీ మాధవి సూచించారు. అంతే కాకుండా సమీప పోలీస్ స్టేషన్‌లో కూడా పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలన్నారు. ఆలస్యం విషమని, అత్యాశ కొంప ముంచుతుందన్న నానుడిని మనసా, వాచా, కర్మణా నమ్మాలని ప్రజలకు హితవు పలికారు.

జిల్లాలో జరుగుతున్న సైబర్ నేరాలను జిల్లా సైబర్ సెక్యూరిటీ టీమ్ నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడమే కాకుండా మోసపోయిన బాధితులు వెంటనే పోలీస్ స్టేషన్‌లలో సైబర్ వారియర్లను సంప్రదించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏ బ్యాంకు ఖాతా నుంచి అయితే డబ్బులు నష్టపోతున్నామో సంబంధిత బ్యాంకులతో మాట్లాడి డబ్బును హోల్డ్ చేయిస్తున్నామని, అంతే కాకుండా గ్రామాల్లో సైబర్ వారియర్ల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

– శెనార్తి మీడియా, కరీంనగర్ :

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *