- కోల్ బెల్ట్ ప్రాంతంలో అసాధారణ వాతావరణం
- ఉదయం 7 గంటలైనా వీడని మంచు తెరలు.. స్తంభించిన జనజీవనం
- పెరిగిన వాయు కాలుష్యం..
- గాలి నాణ్యతపై పర్యావరణవేత్తల ఆందోళన
Naspur: మంచిర్యాల జిల్లా నస్పూర్లో శనివారం ఉదయం అసాధారణ వాతావరణం నెలకొంది. సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలకు పేరొందిన ఈ పారిశ్రామిక కోల్ బెల్ట్ ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజామున ప్రారంభమైన మంచు తీవ్రత ఉదయం ఏడు గంటలు దాటినా తగ్గలేదు. దీంతో పట్టణం ఒక్కసారిగా పర్యాటక ప్రాంతాన్ని తలపించింది.
దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై దృశ్యమానం తీవ్రంగా తగ్గింది. ఎదురుగా వచ్చే వాహనాలు సైతం స్పష్టంగా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ప్రమాదాల భయం పెరగడంతో వాహనదారులు దీపాలు వెలిగించి అత్యంత నెమ్మదిగా ప్రయాణించారు. ఉదయం షిఫ్ట్ విధులకు వెళ్లే సింగరేణి కార్మికులు, పారిశుధ్య కార్మికులు, ఉదయపు నడకకు వచ్చే వారు గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అరుదుగా కనిపించే ఈ చల్లని వాతావరణం స్థానికులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. దట్టమైన మంచు తెరల మధ్య యువత, చిన్నారులు ఉత్సాహంగా ఫోటోలు దిగారు. ఈ చిత్రాలు అంతర్జాల వేదికల్లో విస్తృతంగా వ్యాపించడంతో నస్పూర్ పర్యాటక కేంద్రమైందంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల(నస్పూర్)
