- హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కంచి వేణు
Road Safety:“ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు తెలుసుకుని విధిగా పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతాం” అని హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కంచి వేణు అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవం సందర్భంగా హుజురాబాద్‌లో రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
జాతీయ రహదారిపై ప్రయాణించే కార్లు, లారీలు, మోటార్ క్యాబ్‌లు, మ్యాక్స్ క్యాబ్‌లు, త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాల డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలు, భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. రోడ్లపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
వాహనదారులు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తమ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రమాదాల్లో కుటుంబ పెద్దను కోల్పోతే ఆ కుటుంబం ఎదుర్కొనే పరిస్థితిని వివరించారు. వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని చెప్పారు. అతివేగం అనర్థదాయకమని, మద్యం సేవించి వాహనం నడపవద్దని హెచ్చరించారు. ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని సూచించారు.
అధిక వేగం కారణంగానే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాదాలను నియంత్రించేందుకు నిరంతరం వాహన తనిఖీలు చేపడుతున్నామని, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పర్యవేక్షణ పెంచి ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.
ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు రవాణా వాహనాలు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే లక్ష్యమని వివరించారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ కత్తుల నాగరాజు, హోంగార్డ్ బుర్ర సురేష్, నేషనల్ పర్మిట్ కలిగిన లారీ డ్రైవర్లు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, హుజురాబాద్
