Lepracy: జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమాన్ని ఈ నెల 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టినట్లు చెప్పారు.
650 టీములతో రెండు లక్షలకుపైగా ఇళ్ల సర్వే
సుమారు 650 టీముల ద్వారా రెండు లక్షల 12,500 ఇళ్లను సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎనిమిది లక్షల మంది జనాభాను కవర్ చేస్తున్నట్లు వివరించారు. ప్రతి టీంలో ఆశా కార్యకర్తలు కేటాయించిన ఇళ్లకు వెళ్లి కుష్టు వ్యాధిపై అవగాహన కల్పిస్తూ వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు.
కుష్టు వ్యాధిపై అవగాహన అవసరం
కుష్టు వ్యాధి మైకోబాక్టీరియం అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే సాధారణ వ్యాధి అని అన్నారు. ఇది ప్రధానంగా చర్మం, నరాలను ప్రభావితం చేస్తుందని చెప్పారు. వ్యాధి లక్షణాలు బయటపడేందుకు మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు సమయం పడుతుందని తెలిపారు. ఈ వ్యాధి ఎవరికైనా రావచ్చని, వయసు లేదా లింగ భేదం లేదని స్పష్టం చేశారు. ఇది వంశపారంపర్యం కాదని, శాపం పాపం కాదని అన్నారు.
చికిత్సతో పూర్తిగా నయం
కుష్టు వ్యాధి ఆరు నుంచి పన్నెండు నెలల బహుళ ఔషధ చికిత్సతో పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. ప్రారంభ దశలో గుర్తిస్తే అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉండదని చెప్పారు. చికిత్స అనంతరం అంగవైకల్యం ఉన్నవారికి శస్త్ర చికిత్స ద్వారా సరిచేయవచ్చని వెల్లడించారు. కుష్టు వ్యాధిగ్రస్తులు సాధారణ సామాజిక జీవితం గడపవచ్చని పేర్కొన్నారు.
లక్షణాలు కనిపిస్తే వెంటనే సంప్రదించాలి
చర్మంపై సహజ రంగుకంటే తక్కువగా ఉన్న మచ్చలు, ఎరుపు లేదా రాగి రంగు మచ్చలు, స్పర్శ లేని మచ్చలు, నొప్పి లేని ప్రాంతాలు కనిపిస్తే వెంటనే ఆశా కార్యకర్తలను సంప్రదించాలని సూచించారు. ఇంటింటికి వచ్చే ఆశా కార్యకర్తలకు పూర్తి సహకారం అందించాలని ప్రజలను కోరారు.
70 కేసులు గుర్తింపు, చికిత్సలు
జిల్లాలో ఇప్పటివరకు 70 లెప్రసీ కేసులను గుర్తించి చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఆశా కార్యకర్తలు సందర్శించినప్పుడు వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులకు పంపించాలని ఆదేశించినట్లు చెప్పారు.
అవగాహన కార్యక్రమాలు విస్తరణ
అవగాహన కార్యక్రమాల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పోస్టర్లు, ప్లెక్సీలు, కరపత్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అప్పల ప్రసాద్, డీపీఎంఓ రాఘవయ్య, డీపీఓ ప్రశాంతి, సుమన్ మార్త, సిహెచ్ లింగారెడ్డి, వెంకటేశ్వర్లు, సంతోష్ బుక్, వెంకటేశ్వర, జిల్లా మాస్ మీడియా అధికారి పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
