– ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయాలు
DRUG INSPECTOR : మంచిర్యాల జిల్లాలో మెడికల్ షాపుల దందా అడ్డగోలుగా సాగుతోంది. పుట్టగొడుగుల వలె మెడికల్ షాపులు వెలసి, నిబంధనలు పాటించకుండానే మందుల విక్రయం సాగిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు (MEDICINES) విక్రయిస్తున్న షాపులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఏ ఒక్క మందుల దుకాణంలోనైనా వారు ఇచ్చే మందులకు సంబంధించి బిల్స్ ఇవ్వడమే మానేశారు. ఇదంతా అధికారి కనుసన్నులలోనే నడిచే ప్రైవేటు వ్యాపారమని చెప్పవచ్చు.
డ్రగ్ ఇన్స్ స్పెక్టర్ జాడెక్కడ..
బాధితులు మందుల దుకాణాలపై ఫిర్యాదు చేయాలనుకున్నా, డ్రగ్ ఇన్స్ స్పెక్టర్ ను కలవాలంటే సాధ్యపడటం లేదని వాపోతున్నారు. మేడం ఏ టైంకు వస్తారో, ఏ టైంకి వెళతారో తెలియదని, ఎప్పుడు చూసినా తాళం వేసే ఉంటుందని, అసలు జిల్లాలో ఎన్ని మెడికల్ దుకాణాలున్నాయో అధికారికంగా ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్నారంటే సదరు అధికారి అనుమతి లేని, ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని దుకాణాలకు వత్తాసు పలుకుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారి కార్యాలయం తరచూ మూసి ఉండడం, కార్యాలయంలో అధికారులు కనిపించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఫిర్యాదు చేయాలన్నా, ఎవరికీ, ఎక్కడ ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఏ ప్రభుత్వ అధికారి అయినా నెలలో ఒకటి రెండు రోజులు కనిపించకపోవడం సహజమైతే మంచిర్యాల జిల్లాలో ఔషద నియంత్రణ అధికారి మాత్రం నెలలో రెండు, మూడు రోజులు కనిపిస్తే అదే గొప్ప అని చెప్పవచ్చు.
ప్రజావాణికి అసలు హాజరే కారు…
జిల్లా అధికారులంతా ప్రతి సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరవుతుంటే, డ్రగ్ ఇన్స్పెక్టర్ మాత్రం అక్కడ కనిపించరు. ఇది ఏదో ఒకటి, రెండు ప్రజావాణిలు కాదండీ.., మొదటి నుంచి హాజరుకాకపోవడం విడ్డూరంగా ఉంది. వారి పేరు సంతకాల జాబితాలో లేకపోవడం కూడా అనేక అనుమానాలకు దారితీస్తోంది. ప్రజల ఆరోగ్యానికి నేరుగా సంబంధం ఉన్న మందుల వ్యాపారంపై అధికారుల నిర్లక్ష్యమేంటి అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని హరించే ఈ అక్రమ వ్యాపారాన్ని ఆపాలని, సంబంధిత అధికారులు సమర్థవంతంగా స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :