Paddhy Scam in Macherial
Paddhy Scam in Macherial

Paddy Scam in Mancherial: వైకుంఠ మత్తులో సివిల్ సప్లయ్ అధికారులు?

  • మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై కొనసాగుతున్న అనుమానాలు
  • మిల్లులకు వడ్ల కేటాయింపులపై సందేహాలు
  • కాగితాల్లోనే ధాన్యం సరఫరా?
  • విచారణల తీరుపై పెరుగుతున్న ప్రశ్నలు

Paddy Scam in Mancherial:మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జరుగుతున్న అవకతవకలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. గత నాలుగు నుంచి ఐదు నెలలుగా వివిధ కొనుగోలు కేంద్రాల్లో జరిగిన లావాదేవీలపై అధికారులు విచారణలు చేపడుతుండగా, ఆ విచారణల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఒక్కో కొనుగోలు కేంద్రంలో అధికారులు తీసుకుంటున్న చర్యలు ఒక్కోలా ఉండటం చర్చకు దారి తీస్తోంది.

కొన్ని కేంద్రాల్లో నిర్వాహకులతో పాటు మిల్లులపై కూడా కేసులు నమోదు చేసిన అధికారులు, మరికొన్ని చోట్ల మాత్రం పరిమిత వ్యక్తులకే కేసులు నమోదు చేసి, మిల్లర్లను పక్కన పెట్టడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి వల్ల న్యాయసమ్మత చర్యలపై సందేహాలు నెలకొంటున్నాయి.

కిష్టాపూర్ కొనుగోలు కేంద్రం కేసులో సందేహాలు
జైపూర్ మండలం కిష్టాపూర్ కొనుగోలు కేంద్రంలో జరిగిన అవకతవకలకు సంబంధించి సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. గత రబీ సీజన్‌లో ఈ కేంద్రం నుంచి వేల క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించిన కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని, అందులో లక్షల రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో పలువురు బాధ్యులు ఉన్నప్పటికీ, కేవలం కొందరిపైనే కేసులు నమోదు చేయడం సరైనదేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ కొనుగోలు కేంద్రం నుంచి ఏ మిల్లుకు ఎంత ధాన్యం పంపించారన్న అంశంపై సమగ్ర విచారణ జరిగిందా? నిజంగా ఆ ధాన్యం మిల్లులకు చేరిందా? అనే విషయాలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Paddhy Scam in Macherial
Paddhy Scam in Macherial

ట్రక్ షీట్లు – ధాన్యం చేరిందా?

కిష్టాపూర్ కొనుగోలు కేంద్రం నుంచి జిల్లాలోని పలు రైస్ మిల్లులతో పాటు ఇతర జిల్లాల మిల్లులకు ధాన్యం పంపినట్లు ట్రక్ షీట్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ ట్రక్ షీట్లకు అనుగుణంగా ధాన్యం నిజంగా మిల్లులకు చేరిందా? లేక కేవలం పత్రాల పరంగా మాత్రమే చూపించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ధాన్యం మిల్లులకు చేరి ఉంటే, అక్కడి నిల్వలు, రిజిస్టర్లు, రైస్ మిల్లింగ్ వివరాలు సరిపోలాల్సి ఉంటుంది. ఈ దిశగా అధికారులు భౌతిక పరిశీలన చేశారా? అన్నది కూడా స్పష్టతకు రావాల్సిన అంశమే. మిల్లర్లను విచారణ పరిధి నుంచి పూర్తిగా తప్పించడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు స్వయంగా మిల్లర్ల నుంచే వినిపించడం గమనార్హం.

అధికార యంత్రాంగం – సంఘాల ప్రభావమా?

జిల్లాలో రైస్ మిల్ అసోసియేషన్ ప్రభావం అధికారులపై ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొంతమంది నేతల సూచనల మేరకే చర్యలు తీసుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఆరోపణలకు తెరపడాలంటే అధికారులు పూర్తి స్థాయి, పారదర్శక విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సమగ్ర విచారణే పరిష్కారం

ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఉన్న అనుమానాలకు సమాధానం దొరకాలంటే అర్ధాంతర విచారణలు సరిపోవని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుల వరకు ధాన్యం ప్రయాణించిన ప్రతి దశను పరిశీలించి, బాధ్యులెవరో స్పష్టంగా తేల్చినప్పుడే వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని అంటున్నారు.

పారదర్శకత, సమాన చర్యలే ఈ వ్యవహారంలో కీలకమని, అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా నిజనిర్ధారణ జరిపితేనే ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *