Congress Internal Conflicts
Congress Internal Conflicts : నెట్టి వేసకుంటున్న కాంగ్రెస్ నాయకులు

Congress Internal Conflicts: మంత్రి జూపల్లి పర్యటన రచ్చ రచ్చ

  • వెలుగుచూసిన కాంగ్రెస్ అంతర్గత విభేదాలు
  • మున్సిపల్ ఎన్నికల ముందు బహిర్గతమైన అసంతృప్తి
  • టికెట్ల కేటాయింపుపై అనుమానాలు, ఆరోపణలు
  • నాయకత్వంపై కార్యకర్తల్లో పెరుగుతున్న ప్రశ్నలు

Congress Internal Conflicts: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యలు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా బహిరంగమయ్యాయి. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో బీమా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశం పార్టీ శక్తిని ప్రదర్శించాల్సిన వేదికగా కాకుండా, అసంతృప్తికి అద్దం పట్టే దృశ్యంగా మారింది. పార్టీని ఆరంభం నుంచి నమ్ముకున్న కార్యకర్తలు, ఆశావాహుల్లో పేరుకుపోయిన ఆగ్రహం ఒక్కసారిగా బయటపడింది.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపే ప్రధానంగా వివాదాస్పద అంశంగా మారింది. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన వారిని పక్కనబెట్టి, ఇటీవల చేరిన వారికి, ఆర్థికంగా బలమైన వారికే టికెట్లు కేటాయిస్తున్నారన్న ఆరోపణలు సమావేశమంతా మార్మోగాయి. ఇది కేవలం వ్యక్తిగత అసంతృప్తిగా కాకుండా, పార్టీ నిర్ణయ ప్రక్రియపై నమ్మకం కోల్పోతున్న సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

టికెట్లే కేంద్రబిందువు

సమావేశం కొనసాగుతున్న సమయంలోనే ఆశావాహులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కౌన్సిలర్ టికెట్లను డబ్బుల ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు చెందిన దళిత నాయకుడు కళ్యాణ్‌తో డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి మధ్య జరిగిన తోపులాట పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఆశావాహుల జాబితాలో తన పేరు లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ కళ్యాణ్ వ్యక్తం చేసిన ఆవేదన, పార్టీ లోపలి సామాజిక సమీకరణలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఇలాంటి ఘటనలు పార్టీకి చెందిన వివిధ వర్గాల మధ్య సమన్వయం లోపిస్తున్నదని, నాయకత్వం సమర్థంగా అసంతృప్తిని నియంత్రించలేకపోతున్నదని స్పష్టంచేస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల వంటి స్థానిక స్థాయి పోరాటాల్లో కార్యకర్తలే ప్రధాన బలంగా ఉండగా, వారిలోనే ఈ స్థాయి నిరాశ నెలకొనడం పార్టీకి ప్రమాదకర సంకేతంగా భావించబడుతోంది.

నాయకత్వానికి పరీక్ష

సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలతో మంత్రి జూపల్లి కృష్ణారావు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత గొడవలు బహిరంగంగా చెలరేగడంతో ఆయన సమావేశాన్ని మధ్యలోనే ముగించుకుని వెళ్లిపోవడం, పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వెనుకబాటుకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మున్సిపల్ ఎన్నికల ముందు టికెట్ల కేటాయింపుపై పారదర్శకత, కార్యకర్తలకు న్యాయం చేయకపోతే, అసంతృప్తి మరింత విస్తరించే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్యాతనపల్లి ఘటన కాంగ్రెస్ నాయకత్వానికి హెచ్చరికగా మారిందని, అంతర్గత విభేదాలను సమయానికి పరిష్కరించకపోతే రాజకీయంగా తీవ్ర ప్రభావాలు తప్పవన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

శెనార్తి మీడియా, మంచిర్యాల:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *