- అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ -XI విజయవంతం
- రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్
Opertaion Smile: రామగుండం కమిషనరేట్ పరిధిలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ (Opertaion Smile)-XI విజయవంతమైందని రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఏడాదిలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్(Opration Muskan) కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తప్పిపోయిన, వదిలివేయబడిన, వివిధ రకాల కిరాణ దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, వివిధ కంపని లలో పనిచేస్తున్న బాలలు, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను గుర్తించి వారిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా స్టేట్ హోమ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు.
రామగుండం కమిషనరేట్ వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్-XI కార్యక్రమం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వైద్యశాఖతో వివిధ శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ విజయవంతం గా ముగిసిందని వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్ఐతో పాటు నలుగురు సిబ్బందితో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్-11 కార్యక్రమాన్ని కమిషనరేట్ వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
కమిషనరేట్ పరిధిలో 88 మంది బాలలను గుర్తించినట్లు వివరించారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో బాలురు-11, బాలికలు – 3 మొత్తం మంది – 14, రెండు కేసులు నమోదు చేసి నలుగురు బాలకార్మికులకు విముక్తి కల్పించి, పాఠశాల లో చేర్పించామని వెల్లడించారు. మంచిర్యాల జిల్లా పరిధిలో బాలురు-55, బాలికలు – 19 మొత్తం మంది-74 మందిని గర్తించామని, ఒక కేసు నమోదు చేసి ఇద్దరు బాలకార్మికులకు విముక్తి కల్పించి పాఠశాలలో చేర్పించామని పేర్కొన్నారు.
బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్ములనకు బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. బాలల హక్కులు, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నా, ఎక్కడైనా పని చేసినా, తప్పిపోయిన, వదిలివేయబడిన బాలల సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 (చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్) వారికి, డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. బాలలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు శాఖలతో కలిసి ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయడంలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు.