- దండేపల్లి మండలంలో నిబంధనలు ఉల్లంఘించిన ఘటనపై
- మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆగ్రహం
Divakar Rao: దండేపల్లి మండలంలో నామినేషన్ విత్‌డ్రా ప్రక్రియలో జరిగిన అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాలలోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాత కొమ్ముగూడెం గ్రామ సర్పంచ్ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవి నామినేషన్‌ను విత్‌డ్రా చేయడానికి కాంగ్రెస్ నాయకుల అండతో దండేపల్లి ఎస్ఐ ప్రోత్సాహం చూపించారని ఆరోపించారు. విత్‌డ్రా సమయం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసినా, 4:20 గంటలకు ఎన్నికల కార్యాలయం వెనక ద్వారం తెరిచి విత్‌డ్రా ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ సమయంలో లోపలే ఉన్న బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయగా, ఎస్ఐ బెదిరింపులకు దిగారని ఆయన తెలిపారు. “ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తున్నారు, ఇది సరికాదు అని మా నాయకులు అడిగితే, మీపై కేసులు పెడతాను అంటూ భయపెట్టారు” అని పేర్కొన్నారు.
ఈ ఘటనపై వెంటనే 4:38 గంటలకు జిల్లా కలెక్టర్‌ను ఫోన్ చేసి వివరించానని దివాకర్ రావు చెప్పారు. “మూడుగంటల లోపే వచ్చారనీ, వెరిఫికేషన్ కోసం పిలిచామని కలెక్టర్ మెసేజ్ పంపారు” అని వివరించారు. తరువాత 5:04 గంటలకు మళ్లీ మాట్లాడగా విత్‌డ్రా ఆమోదించలేదని తెలిపారు. అయితే సాయంత్రం 7:38 గంటలకు మరోసారి సంప్రదించినప్పుడు ‘మీ అభ్యర్థి పోటీలో ఉన్నారు, ఎవరో తప్పు సమాచారం ఇస్తున్నారు’ అని సమాధానం ఇచ్చినట్టు పేర్కొన్నారు.
కానీ రాత్రి 9 గంటలకు తిరిగి ఫోన్ చేసి “ఎన్నికల అధికారి విత్‌డ్రా ఆమోదించారు, వారి నిర్ణయాన్ని మార్చలేను, కానీ కోడ్ ఉల్లంఘనపై RO పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాను” అని కలెక్టర్ వెల్లడించారని దివాకర్ రావు అన్నారు.
ఎన్నికల నియమాలను తుంగలో తొక్కుతూ అధికార పార్టీకే అనుకూలంగా పనిచేస్తున్న దండేపల్లి ఎస్సై, ఎన్నికల అధికారి (RO)ను వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, టిబీజీకేఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల :
